Ad Code

Ticker

6/recent/ticker-posts

1. డీ ఫార్మసీ 2. బీ ఫార్మసీ 3. ఫార్మా డీ కి సంబంధించిన కోర్సుల వివరాలు/Details about D Pharmacy B Pharmacy Pharm D Courses


ఔషధ పరిశోధనల్లో, వాటి ఉత్పత్తిలో ప్రధానపాత్ర వహిస్తూ... వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ను అర్థం చేసుకొని, సరైన మందులను అందించేవారే..ఫార్మాసిస్టులు. మందుల మోతాదు.. అవి రోగి శరీరంపై పనిచేసే తీరుపై వీరికి పరిజ్ఞానం ఉంటుంది. ఈ వృత్తిలో స్థిరపడాలనుకునేవారు ముందుగా దీనికి సంబంధించిన కోర్సులను అభ్యసించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌లో ఎంపీసీ లేదా బైపీసీ..ఏ గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసినవారైనా ఫార్మసీ రంగంలో ప్రవేశించవచ్చు.  

ఫార్మసీ విద్యను అభ్యసించడానికి కళాశాల ఎంపిక చాలా ప్రధానమైన అంశం. ఏఐసీటీఈ, పీసీఐ ద్వారా గుర్తింపు పొంది ఉండాలి. ఆయా కళాశాలలకు ప్రధానాచార్యులు, అధ్యాపకులు, ప్రయోగశాలలు, జంతుశాలలు.. తదితరాలు నిబంధనలు మేరకు ఉన్నాయా అనేవి తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ఎందుకంటే ఫార్మసీ విద్యలో బోధనా సిబ్బంది ఎంత ముఖ్యమో.. ప్రయోగశాలలకూ అంతే ప్రాధాన్యముంటుంది. 

ఫార్మసీ విద్యలో   ప్రధానంగా మూడు రకాల కోర్సులున్నాయి. 1. డీ ఫార్మసీ 2. బీ ఫార్మసీ 3. ఫార్మా డీ.
 డీ ఫార్మసీకి ప్రవేశపరీక్ష ఏమీ ఉండదు. దీని ప్రవేశాలను సాంకేతిక విద్యాశాఖ చూస్తుంది. ఇక బీ ఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల ప్రవేశాలను ఎంసెట్‌ ర్యాంకుల ప్రాతిపదికగా ఉన్నత విద్యామండలి నిర్వహిస్తుంది. కళాశాలల్లో 50 శాతం సీట్లు ఎంపీసీ విద్యార్థులకూ, మిగిలిన 50 శాతం సీట్లను బైపీసీ విద్యార్థులకూ కేటాయిస్తారు.

డీ ఫార్మసీ 
 డీ ఫార్మసీ పూర్తిచేసిన వారికి ఆసుపత్రిలో ఫార్మాసిస్టుగా, ఔషధ దుకాణాల్లో ఫార్మాసిస్టుగా, మెడికల్‌ రిప్రెజెంటేటివ్‌గా, హోల్‌సేల్‌ డీలర్‌గా, కెమిస్ట్‌ ఫర్‌ కాస్మటిక్స్‌ ఉత్పత్తి రంగంలో, రీ ప్యాకింగ్‌ ఆఫ్‌ డ్రగ్స్‌, కమ్యూనిటీ ఫార్మాసిస్ట్‌ వంటి ఉద్యోగాలు పొందడానికి అవకాశాలుంటాయి.

బీ ఫార్మసీ
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీగా పిలిచే ఈ కోర్సును నాలుగేళ్ల పాటు అభ్యసించాల్సి ఉంటుంది. ఇంటర్మీడియేట్‌లో ఎంపీసీ, బైపీసీలో 50 శాతం మార్కులు పొందిన విద్యార్థులు అర్హులు. వీరు మూడో సంవత్సరం నుంచి నాలుగో సంవత్సరం మధ్యకాలంలో సుమారు 250 గంటల పాటు ఔషధ తయారీ కర్మాగారాల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది. 
 
ఉన్నత విద్య: బీ ఫార్మసీ తర్వాత మన దేశంలో ఎం-ఫార్మసీ, ఫార్మా-డీ, ఎంబీఏ వంటి ఉన్నత విద్యా కోర్సుల్లో చేరవచ్చు. జీఆర్‌ఈ, జీమాట్‌, ఐఈఎల్‌టీఎస్‌, టోఫెల్‌ తదితర ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులవడం ద్వారా విదేశాల్లోనూ ఉన్నత శ్రేణి ఫార్మసీ విద్యను అభ్యసించవచ్చు. క్లినికల్‌ విభాగంపై పట్టున్న విద్యార్థులు బీ ఫార్మసీ తర్వాత మూడేళ్ల ఫార్మా-డీ(పోస్ట్‌ బ్యాచ్‌లరేట్‌ కోర్సు)ను చేయడానికి అవకాశాలున్నాయి. కళాశాలలకు 10 సీట్లు చొప్పున ఔషధ మండలి వీరికి సీట్లను కేటాయిస్తుంది.

బీ ఫార్మసీ పూర్తిచేశాక గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (జీప్యాట్‌) ద్వారా దేశంలోని ఏదైనా ఫార్మసీ కళాశాలలో ఎం ఫార్మసీలో ప్రవేశం పొందవచ్చు. రాష్ట్ర స్థాయిలో పీజీఈసీఈటీ ద్వారా రాష్ట్రంలోని ఫార్మసీ కళాశాలల్లో ఎం ఫార్మసీలో చేరవచ్చు. జాతీయ స్థాయిలో ఎన్‌ఐపీఈఆర్‌ అర్హత పరీక్ష ద్వారా దేశంలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్‌ రిసెర్చీ విద్యాసంస్థల్లో ప్రవేశం సాధించవచ్చు. జీఆర్‌ఈ, ఐఈఎల్‌టీఎస్‌, ఎన్‌ఏపీఎల్‌ఈఎక్స్‌, టోఫెల్‌ వంటి అర్హత పరీక్షల ద్వారా విదేశాల్లో ఎంఎస్‌ ఫార్మాస్యూటికల్‌ సైన్సెస్‌  కోర్సును పూర్తిచేయవచ్చు. క్యాట్‌, ఐసెట్‌ అర్హత పరీక్షల ద్వారా ఎంబీఏను కూడా అభ్యసించవచ్చు. భారత ఔషధ మండలి ప్రకారం 12 విభాగాల్లో ఎం ఫార్మసీలో ప్రవేశం లభిస్తుంది. ఫార్మాస్యూటిక్స్‌, ఫార్మాకెమెస్ట్రీ, ఫార్మాఅనాలిసిస్‌, ఫార్మకాలజీ, ఫార్మకాగ్రసీ విభాగాలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

నూతన మార్గాలు: విదేశాల్లో పీజీ ఫార్మసీ పూర్తిచేసినవారికి ఉద్యోగ భద్రతతో పాటు బహుళజాతి సంస్థల్లో ఆకర్షణీయమైన వార్షికాదాయం కూడా లభిస్తుంది. సైన్స్‌, హెల్త్‌కేర్‌, కంప్యూటర్‌ టెక్నాలజీ, మ్యాథ్స్‌, కౌన్సెలింగ్‌ రంగాలకు అనుసంధానమైన కొత్త సర్టిఫికెట్‌ కోర్సులతో ఫార్మసీ విద్యకు ఉపాధి అవకాశాలు ప్రపంచమంతటికీ విస్తరించాయి.

ఉద్యోగావకాశాలు
వీరు ఎంచుకునే ప్రత్యేక విభాగాలను బట్టి ఆయా విభాగాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. బీ ఫార్మసీ పూర్తిచేసినవారికి ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీ, ప్రాక్టీస్‌ సెట్టింగ్‌, ఇతర ఉద్యోగావకాశాలుంటాయి. ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీలో ఉద్యోగం సంపాదించినవారికి రోగులతో గానీ, వైద్యులతో గానీ ప్రత్యక్ష సంబంధాలుండవు. వీరికి పరిశోధన, అభివృద్ధి రంగాల్లో డ్రగ్‌ డిస్కవరీ, ఫార్ములేషన్‌ ప్రాసెస్‌, డెవలప్‌మెంట్‌ స్టెబిలిటీ టెస్టింగ్‌, ప్యాకేజింగ్‌ డెవలప్‌మెంట్‌ వంటి విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి. రిసెర్చి అసోసియేట్‌, రిసెర్చి ఎగ్జిక్యూటివ్‌,  రిసెర్చి సైంటిస్ట్‌, రిసెర్చి డైరెక్టర్‌, రిసెర్చి డెవలప్‌మెంట్‌ మేనేజర్‌ వంటి ఉన్నత హోదా కలిగిన ఉద్యోగాల్లోనూ స్థిరపడవచ్చు.

ఫార్మా డీ

డాక్టర్‌ ఆఫ్‌ ఫార్మసీగా పిలిచే ఈ కోర్సు వ్యవధి ఆరేళ్లు. ఇంటర్‌లో ఎంపీసీ/బైపీసీ కోర్సుల్లో 50శాతం మార్కులు, ఎంసెట్‌ ర్యాంకు ఆధారంగా సీటు లభిస్తుంది. ఈ విద్యార్థులకు ఆసుపత్రిలో క్లినికల్‌, రోగ సంబంధిత అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తిచేసినవారికి విదేశాల్లో గిరాకీ ఉంది. 2008 నుంచి విదేశాల్లో ఉద్యోగావకాశాలకు అనుగుణంగా ఈ కోర్సును  ప్రారంభించారు. బోధనాసుపత్రికి అనుబంధంగా ఫార్మా డీ కోర్సును నిర్వహించే కళాశాల పనిచేస్తుంది. ఈ కోర్సు విద్యార్థులు రెండో సంవత్సరం నుంచే ఆసుపత్రిలో క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లాల్సి ఉంటుంది. చివరి సంవత్సరంలో ఆసుపత్రిలోనే ఉండి ఇంటర్న్‌షిప్‌ చేస్తారు.


ఉద్యోగావకాశాలు
ఈ కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు రాష్ట్ర ఫార్మసీ మండలిలో తమ సమాచారాన్ని నమోదు చేసుకోవాలి. వీరికి రెగ్యులేటరీ సంస్థల్లో, కమ్యూనిటీ ఫార్మసీ, క్లినికల్‌ ఫార్మసీ విభాగాల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి. ఇంటర్న్‌షిప్‌ చేసిన విభాగాన్ని బట్టి న్లూక్లియర్‌, పిడియాట్రిక్‌, ఆంకాలజీ, జీరియాట్రిక్‌, వెటర్నరీ, న్యూట్రిషనల్‌, సైకియాట్రిక్‌, హైపర్‌టెన్షన్‌, డయాబెటిక్‌, డ్రగ్‌ ఇన్ఫర్మేషన్‌.విభాగాల్లో ప్రత్యేక ఫార్మాసిస్టులుగా పనిచేయవచ్చు. క్లినికల్‌ పరిశోధన సంస్థలో,  కేస్‌ రిపోర్ట్‌ ఫామ్‌ రివ్యూ అండ్‌ డిజైనింగ్‌, ఏడీఆర్‌ రిపోర్టింగ్‌, పేషెంట్‌ మానిటరింగ్‌, బయో అనలిటికల్‌ స్టడీస్‌, డేటా మేనేజ్‌మెంట్‌ ఫర్‌ గ్లోబల్‌ ట్రయల్స్‌, క్లినికల్‌ టాక్సికాలజీ, ఫార్మాథెరాప్యూటిక్స్‌ విభాగాల్లోనూ ఉద్యోగావకాశాలుంటాయి. ఈ కోర్సు అనంతరం ఆసక్తి ఉంటే పీహెచ్‌డీ కూడా చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments