Ad Code

Ticker

6/recent/ticker-posts

కార్తీక పురాణం 11వ అధ్యాయం(మంథరుడు - పురాణ మహిమ)/Karthika Puranam

 


తిరిగి వశిష్టుడు ఇలా చెబుతున్నారు. ”ఓ జనక మహారాజా! ఈ కార్తీక మాస వ్రతం మహత్యాన్ని గురించి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. ఈ నెలలో విష్ణుదేవుడిని అవిసె పూలతో పూజించినట్లయితే.. చాంద్రాయణ వ్రతం చేసిన ఫలితం కలుగుతుంది. విష్ణు అర్చన తర్వాత పురాణ పఠనం చేసినా, చేయించినా, విన్నా, వినిపించినా… అలాంటి వారు వైకుంఠాన్ని పొందుతారు. దీన్ని గురించిన మరో ఇతిహాసాన్ని చెబుతాను. సావధానంగా విను… అని ఇలా చెప్పసాగారు.
 
పూర్వం కళింగ రాజ్యంలో మంథరుడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు ఇతరుల ఇళ్లలో వంటలు చేస్తూ, అక్కడే భోజనం చేస్తూ, మద్య మాంసాలు సేవిస్తూ… తక్కువ జాతి సాంగత్యంలో గడపసాగాడు. ఆ కారణంగా స్నాన, జప, దీపారాధనలను పాటించకుండా, దురాచారుడిగా తయారయ్యాడు. అయితే… ఆయన భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతవంతురాలు.  భర్త ఎంతటి దుర్మార్గుడైనా, పతియే ప్రత్యక్ష దైవమనే ధర్మాన్ని పాటించేది. విసుగు చెందక సకల ఉపచారాలు చేసేది. పతివ్రతాధర్మాన్ని నిర్వర్తిస్తుండేది.

మంథరుడు ఇతరుల ఇళ్ళల్లో వంటలు చేస్తూ, ఆదాయం సరిపోక వర్తకం కూడా చేయసాగాడు. ఆఖరికి దానివల్ల కూడా పొట్టగడవకపోవడంతో దొంగతనాలు చేయడం ఆరంభించాడు. దారికాచి బాటసారులను బెదిరించి, వారి దగ్గర ఉన్న ధనం, వస్తువులను అపహరించి జీవించసాగాడు.

ఒక రోజు ఒక బ్రాహ్మణుడు అడవి దారిలో పోతుండగా… అతన్ని భయపెట్టి, కొంత ధనాన్ని అపహరించాడు. ఆ సమయంలో ఇద్దరి మధ్యా ముష్టియుద్ధం జరిగింది. అంతలో అక్కడకు ఇంకో కిరాతకుడు వచ్చి, ధనాశతో వారిద్దరినీ చంపేసి, ధనాన్ని తీసుకెళ్లాడు. అంతలో అక్కడ ఒక గుహ నుండి పులి గాండ్రించు కుంటూ కిరాతకుడిపైన పడింది. కిరాతకుడు దాన్ని కూడా వధించాడు. అయితే పులి చావడానికి ముందు పంజాతో బలంగా కొట్టిన దెబ్బ ప్రభావం వల్ల కొంతసేపటికి తీవ్ర రక్తస్రావంతో అతను కూడా చనిపోయాడు. కొద్ది క్షణాల వ్యవధిలో చనిపోయిన నలుగురు నరకానికి వెళ్లారు. హత్యల కారణంగా వారంతా నరకంలో నానా విధాలైన శిక్షలను అనుభవించారు.

మంధరుడు చనిపోయిన రోజు నుంచి అతని భార్య నిత్యం హరినామ స్మరణ చేస్తూ సదాచారవర్తినిగా భర్తను తలుచుకుంటూ కాలం గడిపింది. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి రాగా… ఆమె గౌరవంగా అర్ఘ్యపాద్యాలను పూజించి ”స్వామీ! నేను దీనురాలను, నాకు భర్తగానీ, సంతతి కానీ లేదు. నేను సదా హరి నామాన్ని స్మరిస్తూ జీవిస్తున్నాను. నాకు మోక్షం లభించే మార్గం చూపండి” అని ప్రార్ధించింది. ఆమె వినమ్రత, ఆచారాలకు సంతసించిన ఆ ఋషి ”అమ్మా… ఈ రోజు కార్తీక పౌర్ణమి. చాలా పవిత్రమైనది. ఈ రోజును వృధా చేయకు. ఈ రాత్రి దేవాలయంలో పురాణాలు చదువుతారు. నేను చమురు తీసుకుని వస్తాను. నువ్వు ప్రమిదలు, వత్తులు తీసుకురా. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలితాన్ని నీవు అందుకుంటావు” అని చెప్పారు. దానికి ఆమె సంతసించి, వెంటనే దేవాలయానికి వెళ్లి శుభ్రం చేసి, గోమయంతో అలికి, ముగ్గులు పెట్టి, తానే స్వయంగా వత్తి చేసి, రెండు వత్తులు వేసి, ఋషి తెచ్చిన నూనెను ప్రమిదలో పోసి, దీపారాధన చేసింది. ఆ తర్వాత ఇంటికి వెళ్లి తనకు కనిపించిన వారిని ”ఈ రోజు ఆలయంలో జరిగే పురాణ పఠనానికి తప్పకుండా రావాలి” అని ఆహ్వానించింది. ఆమె కూడా రాత్రి పురాణం విన్నది. ఆ తర్వాత కొంతకాలం విష్ణు నామస్మరణతో జీవించి, మరణించింది.

ఆమె పుణ్యాత్మురాలవ్వడం వల్ల విష్ణుదూతలు వచ్చి విమానమెక్కించి వైకుంఠానికి తీసుకెళ్లారు. అయితే ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వల్ల కొంచెం దోషం కలిగింది. కొద్ది నిమిషాలు నరకంలో గడపాల్సి వచ్చింది. దీంతో మార్గమధ్యంలో యమలోకానికి తీసుకెళ్లారు. అక్కడ నరకంలో మరో ముగ్గురితో కలిసి బాధపడుతున్న భర్తను చూసి ఒక్క క్షణం దుఃఖించింది. విష్ణుదూతలతో ” ఓ విష్ణుదూతలారా! నా భర్త, ఆయనతోపాటు మరో ముగ్గురు నరకబాధలు అనుభవిస్తున్నారు. వారిని ఉద్దరించడమెలా?” అని అడుగగా … విష్ణుదూతలు ఇలా చెబుతున్నారు.

 "అమ్మా! నీ భర్త బ్రాహ్మణుడై యుండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. రెండవ వాడు కూడా బ్రాహ్మణుడైననూ అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనముపహరించెను. మూడవ వాడు వ్యాఘ్రము. నాలుగోవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలం లేపనము, మధ్య మాంసభక్షణ చేసాడు గాన పాపాత్ముడైనాడు. అందుకే యీ నలుగురు నరక బాధలు పడుతున్నారు", అని వారి చరిత్రలు చెప్పిరి.
అందుకామె చాల విచారించి "ఓ పుణ్యాత్ములారా! నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరించమని ప్రార్ధించింది.  అందుకా దూతలు "అమ్మా! కార్తీక శుద్ధ పౌర్ణమినాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలము కిరాతకునకు, పురాణం వినుటవలన కలిగిన ఫలము ఆ విప్రునికి ధారపోసినట్టయితే  వారికి మోక్షం కలుగునని చెప్పారు. ఆమె అందుకు సరేనని, ఆ విధానంగానే ధారపోసింది. అప్పుడా ఆ నలుగురూ ఆమెతో కలిసి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్లారు. కాబట్టి , ఓరాజా! కార్తీకమాసములో పురాణం వినడం వల్ల, దీపాలు వెలిగించడం వలన ఎలాంటి ఫలితం కలుగుతుందో విన్నావు కదా !” అని వశిష్టుల వారు చెప్పారు.

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి,  ఏకాదశాధ్యాయము - పదకొండవరోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!

స్వస్తి !

Post a Comment

0 Comments