ఓం నమః శివాయ
కార్తీక పురాణం - 5వ అధ్యాయము(వనబోజన మహిమ)ఓ జనక మహారాజా! కార్తీకమాసములో స్నానం, దానం, పూజ నిర్వహించాక శివాలయములో గానీ, విష్ణ్యాలయములో గానీ శ్రీమద్భగవద్గీతా పారాయణము తప్పక చేయాలి. అలా చేసిన వారి సర్వ పాపాలు నివృత్తి అవుతాయి.
ఈ కార్తీక మాసంలో కరవీర పుష్పాలు అంటే గన్నేరు పూలు శివకేశవులకు సమర్పించినవారు వైకుంఠమును పొందుతారు. భగవద్గీత కొంతవరకు పఠించిన వారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. చివరికి అందులోని శ్లోకములలో ఒక్క పాదమైనా కంఠస్థం చేసినవారు కూడా విష్ణు సాన్నిధ్యం పొందుతారు.
కార్తీక మాసంలో పెద్ద ఉసిరికాయలతో నిండివున్న ఉసిరి చెట్టు క్రింద సాలగ్రామము ఉంచి, యధోచితంగా పూజించి, విష్ణుమూర్తిని ధ్యానించి, ఉసిరి చెట్టు నీడన కూర్చుని భుజించాలి. బ్రాహ్మణులకు కూడా ఉసిరి చెట్టు క్రిందనే భోజనం పెట్టి, దక్షిణ తాంబూలాలతో సత్కరించి నమస్కరించాలి.
వీలునుబట్టి ఉసిరిచెట్టు క్రింద పురాణకాలక్షేపం చేయాలి. పూర్వం ఈ విధంగా చేసిన ఒక బ్రాహ్మణ పుత్రుడికి నీచజన్మము పోయి, నిజరూపము కలిగింది అని వశిష్ఠులవారు చెప్పారు. అది విని జనకరాజు "మునివర్యా! ఆ బ్రాహ్మణ యువకునకు నీచ జన్మము ఎందుకు కలిగింది? దానికి గల కారణమేమిటి " అని ప్రశ్నించగా, వశిష్ఠులవారు యీ విధంబుగా ఆ కథని వివరించసాగారు.
కిరాత మూషికములు మోక్షము పొందుట :
రాజా! కావేరీ తీరమున ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరగడం వలన నీచ సహవాసం లు చేసి, ఆచారాన్ని విడిచి ప్రవర్తించ సాగాడు. అతని దురాచారములను చూసి, ఒక రోజు అతని తండ్రి దగ్గరకు పిలిచి "బిడ్డా! నీ దురాచారములకి అంతు లేకుండా వున్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఈ నిందలు నేను పడలేకపోతున్నాను. కాబట్టి , నీవు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలిగిపోవడమే కాకుండా నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది.” అని బోధించాడు.
రాజా! కావేరీ తీరమున ఒక చిన్న గ్రామంలో దేవశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి ఒక పుత్రుడు ఉన్నాడు. అతని పేరు శివశర్మ. శివశర్మ చిన్నతనము నుండి భయభక్తులు లేక అతిగారాబముగ పెరగడం వలన నీచ సహవాసం లు చేసి, ఆచారాన్ని విడిచి ప్రవర్తించ సాగాడు. అతని దురాచారములను చూసి, ఒక రోజు అతని తండ్రి దగ్గరకు పిలిచి "బిడ్డా! నీ దురాచారములకి అంతు లేకుండా వున్నది. నీ గురించి ప్రజలు రకరకాలుగా చెప్పుకుంటున్నారు. నన్ను నిలదీసి అడుగుతున్నారు. ఈ నిందలు నేను పడలేకపోతున్నాను. కాబట్టి , నీవు కార్తీక మాసంలో నదీ స్నానం చేసి, శివకేశవులను స్మరించి, సాయంకాల సమయంలో దేవాలయంలో దీపారాధన చేయి. దీనివల్ల నీవు చేసిన పాపములు తొలిగిపోవడమే కాకుండా నీకు మోక్షప్రాప్తి కూడా కలుగుతుంది.” అని బోధించాడు.
అప్పుడు శివశర్మ ఇలా అన్నాడు. తండ్రీ! స్నానము చేయడమనేది వంటి యొక్క మురికి పోవడానికి మాత్రమే కాని వేరు కాదు! స్నానం చేసి పూజలు చేసినంత మాత్రాన భగవంతుడు కనిపిస్తాడా? దేవాలయంలో దీపాలు వెలిగించిన లాభమేమిటి? వాటిని ఇంట్లో పెట్టడం వలన ఇల్లయినా వెలుగులతో నిండుతుంది కదా! అని వ్యతిరేకార్థంతో పెడసరంగా సమాధానమిచ్చాడు.
కుమారుడు సమాధానం విని, ఆ తండ్రీ "ఓరీ నీచుడా! కార్తీకమాస ఫలమును అంత చులకనగా భావిస్తున్నావా? నీవు అడవిలో ఉండే రావి చెట్టు తొర్రలో ఎలుక రూపంలో బ్రతికెదవుగాక" అని శపించాడు.
ఆ శాపంతో కుమారుడైన శివశర్మకు జ్ఞానోదయమై భయపడి తండ్రి పాదములపై పడి "తండ్రీ! నన్ను క్షమించు. అజ్ఞానంధకారములో పడి దైవమునూ, దైవకార్యంలనూ యెంతో చులకన చేసి వాటి ప్రభావములు గ్రహింప లేకపోయాను. ఇప్పుడు నాకు పశ్చాత్తాపము కలిగింది. కాబట్టి కరుణించి నాకు ఆ శాపవిమోచనం ఎప్పుడు ఎలా కలుగుతుందో వివరించండి”అని వేడుకున్నాడు.
అప్పుడు దేవశర్మ "బిడ్డా! నా శాపమును అనుభవిస్తూ మూషికమువై సంచరిస్తున్న సమయంలో నువ్వు ఎప్పుడు కార్తీక మాహాత్మ్యమును వినగలవో, అప్పుడు నీకు పూర్వ దేహస్థితి కలిగి ముక్తిని పొందగలవు" అని శాపవిమోచనా మార్గాన్ని కుమారునికి చెప్పి ఊరడించాడు. వెంటనే శివశర్మ ఎలుక రూపాన్ని పొంది అడవికి చేరుకొని , ఒక రావి చెట్టు తొర్రలో దూరి నివసిస్తూ, పళ్ళు , ఫలాలు తింటూ జీవించసాగాడు.
ఆ అడవి కావేరీ నదీ తీర సమీపంలో ఉండటం వల్ల స్నానం చేయడానికి నదికి వెళ్లే వారు, కాసేపు ఈ ఎలుక నివాసమున్న రావి వృక్షం నీడలో కొంతసేపు విశ్రమించి, లోకాభిరామాయణం చర్చించుకుంటూ, నదికి వెళుతుండేవారు. ఇలా కొంతకాలం తరువాత, కార్తీకమాసములో ఒకనాడు మహర్షి విశ్వామిత్రులవారు శిష్య సమేతముగా కావేరీ నదిలో స్నానం చేసేందుకు బయల్దేరారు.
స్నానానంతరం, దూరాభారం ప్రయాణపు బడలికచే, మూషికము ఉన్న ఆ వృక్షం క్రింద ఆగారు. అక్కడ కూర్చొని శిష్యులకు కార్తీక పురాణము వినిపించసాగారు. ఈలోగా రావి చెట్టు తొర్రలో నివసిస్తున్న మూషికము వీరి దగ్గరనున్న పూజాద్రవ్యములలో ఏదైనా తినే వస్తువు దొరుకుతుందేమోనని బయటకు వచ్చి, చెట్టు మొదట నక్కి చూడసాగింది.
ఇదిలా ఉంటే, ఒక కిరాతకుడు శిష్య సమేతంగా వచ్చింది మునీశ్వరుడని తెలియక, ఇంతమంది ఉన్నారు కాబట్టి, వాళ్ళు బాటసారులై ఉండవచ్చు. కొల్లగొడితే బోలెడు ధనం దొరకొచ్చనే ఆశతో వారి అడుగుజాడలు అనుసరిస్తూ, అక్కడికి చేరుకున్నాడు. కానీ, తీరా చూస్తే ఉన్నవారందరూ మునిపుంగవులు, సర్వసంగపరిత్యాగులే! వారిని చూడగానే అతని మనస్సు మారిపోయింది. వారికి నమస్కరించి "మహానుభావులారా! తమరు ఎవరు? ఎక్కడినుండి వచ్చారు? మీ దివ్య దర్శనంతో నా మనస్సులో చెప్పలేని ఆనందం కలుగుతుంది. దయచేసి తెలియజేయండి" అని ప్రాధేయపడ్డాడు.
అప్పుడా విశ్వామిత్రులవారు "ఓయీ కిరాతకా! మేము కావేరీ నదీ స్నానార్థం, ఈ ప్రాంతానికి వచ్చాము. స్నానమాచరించి, కార్తీక పురాణం పారాయణం చేస్తున్నాము. నువ్వుకూడా మాతో కూర్చుని శ్రద్ధగా విను" అని ఆదేశించారు . అప్పుడా కిరాతకుడు మారుమాట్లాడకుండా అలాగేనని, వారితో కలిసి విశ్వామిత్రుడు వారు చెబుతున్న అద్భుతమైన కథా రసాస్వాదన చేయనారంభించాడు.
ఆ పుణ్య శ్రవణం వలన అతనికి తన పూర్వజన్మ జ్ఞానం జ్ఞప్తికి వచ్చింది . పురాణ శ్రవణ నంతరము ఆ తపస్వికి ప్రణామం చేసి, తన పల్లెకు వెళ్ళాడు. అలాగే, అప్పటివరకూ చెట్టుచాటున నక్కిన ఎలుక కూడా తన పూర్వ రూపాన్ని పొందింది. బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుని దగ్గరికి వచ్చిన శివశర్మ "మునివర్యా! ధన్యోస్మి. తమ దయవల్ల నేను కూడా నా మూషిక రూపమునుండి విముక్తుడనయ్యాను" అని తన వృత్తాంతమంతా చెప్పి వెళ్ళిపోయాడు.
కాబట్టి ఓ జనకా! ఇహములో సిరిసంపదలు, పరలోకమున మోక్షము కోరే వారు తప్పక ఈ కార్తీక పురాణమును చదివి, ఇతరులకు వినిపించాలి.” అని చెప్పారు వసిష్ఠ మహర్షి.
స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి, ఐదవ అధ్యాయము, ఐదవరోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!
స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీక మాహత్మ్యమందలి, ఐదవ అధ్యాయము, ఐదవరోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !!
0 Comments