Ad Code

Ticker

6/recent/ticker-posts

కార్తీక పురాణము, ఏడవ అధ్యాయము (శివ కేశవార్చనా విధులు)/Karthika Puranam



ఓం నమః శివాయ

వశిష్ట మహాముని ఇలా చెబుతున్నాడు.  ’ఓ జనక మహారాజా! విను.  కార్తీక మహాత్మ్యమును  ఇంకా వివరిస్తాను. ప్రసన్న చిత్తుడై విను. కార్తిక మాసములో ఎవరు కమలములచేత పద్మపత్రాయతాక్షణుడైనటువంటి శ్రీ హరిని పూజిస్తారో,  వారి ఇంట పద్మవాసిని అయిన లక్ష్మీదేవి నిత్యమూ నివాసముంటుంది.

ఈ మాసంలో భక్తితో, తులసీదళములతోనూ, జాతి పుష్పములైన జాజి, మందార, పున్నాగ, చంపక ఇత్యాదులతోనూ శ్రీ హరిని పూజించువాడు తిరిగి భూమి మీద జన్మించడు. ఈ మాసమున మారేడు దళములతో సర్వవ్యాపకుడైన శివుడిని పూజించేవాడు తిరిగి ఈ భూమిమీద జన్మించడు.

కార్తీక మాసములో  భక్తితో పండ్లను దానమిచ్చిన వాని పాపములు సూర్యోదయం కాగానే చీకటి తొలగినట్లు నశిస్తాయి. వుసిరిక కాయలతో ఉన్న వుసిరి చెట్టు క్రింద శ్రీ హరిని పూజించు వానిని యముడు కన్నెత్తి చూసే సాహసమైన చేయజాలడు.

కార్తీక మాసమున తులసీ దళములతో సాలగ్రామమును పూజించువాడు ధన్యుడగును, దానిలో సందేహమేలేదు. కార్తికమాసంలో  బ్రాహ్మణులతో వనభోజన మాచరించువాని మహాపాతకములన్నీ నశిస్తాయి. బ్రాహ్మణులతో కూడి వుసిరి చెట్టు దగ్గర సాలగ్రామమును పూజించేవాడు వైకుంఠమునకు పోయి అక్కడ విష్ణుపదమొందగలడు.

కార్తీక మాసంలో భక్తితో శ్రీ హరి ఆలయములో  మామిడి ఆకులతో తోరణం కట్టినవానికి మోక్షం దొరుకుతుంది. శ్రీ హరికి అరటి స్తంభములతో గానీ, పువ్వులతో గానీ మంటపాన్ని నిర్మించి, పూజించిన వారికి  వైకుంఠంలో  చిరకాల వాసము కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో  ఒక్కసారైనా హరి ముందు సాష్టాంగ ప్రమాణం చేసినవారు పాపముక్తులై అశ్వమేధయాగ ఫలాన్ని పొందగలరు.

సంపత్తి  గలవారు శివ కేశవుల ఆలయములకు వెళ్లి భక్తితో  జపం, హోమం, దేవతార్చన చేయడం వలన పితృ గణాలతో సహా వైకుంఠానికి వెళ్ళగలరు. ఈ మాసంలో  వస్త్రదానం చేసినవారు పదివేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు.

కార్తీక మాసంలో శివాలయమున గాని,  విష్ణు ఆలయమున గాని శిఖరముపై ధ్వజారోహణం చేసిన వాని  పాపములు గాలికి కొట్టుకుని పోయిన ధూళి లాగా నశించి పోతాయి. ఈ మాసంలో నల్లవి కానీ తెల్లవి కానీ అవిసపువ్వులతో శ్రీ హరిని పూజిస్తే , పదివేల యజ్ఞాలు చేసిన ఫలం లభిస్తుంది . ఈ మాసంలో బృందావనమును  ఆవు పేడతో అలికి, రంగవల్లులతో  శంఖ పద్మాదులను తీర్చిదిద్దిన మగువ శ్రీ హరి దీవెనలు పొందగలదు. 

ఈ కార్తీక మాసములో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరి పిండితో శంఖు చక్ర ఆకారముల ముగ్గులు పెట్టి, నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిద నుంచి నిండా నువ్వులు నూనె పోసి, వత్తిని వేసి వెలిగించ వలెను.ఈ దీపము రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందా దీపమందురు. ఈ విదముగా చేసి, నైవేద్యమిడి కార్తీక పురాణము చదువు చుండిన  యెడల హరిహరులు సంతసించి కైవల్య మొసంగెదరు. 
 
కార్తీక మాసంలో శివునికి జిల్లేడు పువ్వులతో అర్చన జరిపినవాడు చిరకాలం జీవించి చివరకు మోక్షమును పొందగలడు. ఈ మాసంలో మల్లెపువ్వులతో శ్రీ హరిని పూజించు వాని పాపములు సూర్యోదయానంతరం చీకట్ల లాగా నశిస్తాయి. తులసి గంధముతో సాలగ్రామమును పూజించిన వాని పాపములు దద్గమై,  విష్ణులోకాన్ని పొందెదరు. 

.కార్తీక మాసంలో శివాలయమున గాని, విష్ణు ఆలయమున  గాని స్త్రీగానీ, పురుషుడు గానీ నాట్యము చేసినట్టయితే, పూర్వజన్మ సంచితమైన పాతకములు కూడా నశిస్తాయి. ఈ మాసంలో భక్తితో అన్నదాన మాచరించు వాని పాపములు గాలికి కొట్టుకుపోయిన మబ్బుల్లాగా తేలిపోతాయి. 

కార్తీక మాసంలో తిలాదానం, మహానదీ స్నానము, బ్రహ్మపత్రభోజనము, అన్నదానం అనే నాలుగు ధర్మములు ఆచరించాలి. ఈ మాసంలో దానం, స్నానము యథాశక్తిగా చేయనివాడు మరుజన్మలో శునకమై తిండి దొరకక నీచ
జన్మం పొందెదరు. 

ఈ మాసములో ఇతరులు సమర్పించిన దీపమును చూసి ఆనందము పొందేవారి పాపములు కూడా ఏ సందేహములేకుండా నశించిపోతాయి.  ఇతరులకు హరి హరుల పూజకై త్రికరణ శుద్ధిగా సహాయము చేయువాడు స్వర్గమును పొందుతాడు. కావున కార్తీక మాసము నెలరోజులూ పూజలు చేయలేని వారు ఒక్క  సోమవారమైనను  శివ కేశవులను పూజించినవారికి మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా! నీవు కూడా యీ వ్రతమాచరించి తరింపుముయని చెప్పెను.

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, ఏడవ అధ్యాయము - ఏడవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ  మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి

Post a Comment

0 Comments