Ad Code

Ticker

6/recent/ticker-posts

కార్తీక పురాణం - నాలుగవ అధ్యాయం(దీపారాధన మహిమ)/Karthika Puranamఓం నమః శివాయ

కార్తీక పురాణం - నాలుగవ అధ్యాయం(దీపారాధన మహిమ)

వశిష్ఠ మహర్షి  కార్తీక మాస వ్రత మహిమ వల్ల బ్రహ్మ రాక్షస జన్మ నుంచి కూడా విముక్తి పొందగలరని చెబుతుండగా, జనకుడు మహాతపస్వి! తమరు వివరిస్తున్న ఈ ఇతిహాసాలు విన్న కొద్ది ఇంకా వినాలనే కోరిక కలుగుతోంది. కార్తీకమాసములో ముఖ్యంగా చేయవలసినవి ఏమిటి? ఏ దేవతని ఉద్దేశించి పూజ చేయాలో వివరించండి. అని కోరాడు. అప్పుడు  వశిష్ఠులవారు ఇలా చెప్పసాగాడు.

జనకా! కార్తీక మాసంలో సర్వ సత్కార్యాలు చేయవచ్చు. దీపారాధన వీటిల్లో  అతి ముఖ్యమైనది . దీనివల్ల అత్యధికమైన ఫలితాన్ని పొందవచ్చు . శివకేశవుల ప్రీత్యర్థము, శివాలయములోగాని విష్ణ్యాలయములోగాని ఈ దీపారాధనము చేయవచ్చు.

సూర్యాస్తమయ సమయంలో, అంటే సంధ్యా సమయంలో  శివకేశవుల సన్నిధిలో గాని, ఆలయ ప్రాకారములోగాని దీపముంచిన వారు సర్వపాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తిని పొందగలరు.

శతృజిత్కథ:
పూర్వము పాంచాలదేశమును పరిపాలిస్తున్న రాజుకు సంతతి లేక అనేక యజ్ఞయాగాదులు చేశాడు.  అయినా ఫలితం లేకపోవడంతో, గోదావరీ తీరము చేరి  నిష్ఠతో తపస్సు చేయసాగాడు. అప్పుడక్కడికి పిప్పలాదుడనే  మునిపుంగవుడు వచ్చి, "పాంచాల రాజా! నీవెందుకింత ఘోర తపస్సు చేస్తున్నావు? నీ కోరిక ఏమిటి? అని ప్రశ్నించాడు.  అప్పుడా రాజు "ఋషిపుంగవా! నాకు అష్టయిశ్వర్యములు, రాజ్యము, సంపదా ఉన్నాయి. కానీ  నా వంశము నిల్పుటకు పుత్రసంతానము లేక, కృంగి కృశించి యీ తీర్థస్థానమున తపమాచరిస్తున్నాను." అని వివరించాడు.

అప్పుడా  మునిపుంగవుడు "ఓయీ! కార్తీకమాసమున శివసన్నిధిలో  శివదేవుని ప్రీతి కోసం దీపారాధన చేస్తే, నీ కోరిక నెరవేరుతుంది” . అని చెప్పి వెళ్ళిపోయాడు.

వెంటనే ఆ పాంచాల రాజు తన దేశానికి వెళ్ళి, పుత్ర ప్రాప్తి కోరుతూ కార్తీకమాసం నెలరోజులూ దీపారాధనలు చేయించి, దాన ధర్మాదులతో నియమానుసారంగా వ్రతాన్ని చేసి, ప్రసాదాన్ని ప్రజలందరికీ పంచిపెడుతూ కార్తీకమాసమంతా దీక్షని కొనసాగించాడు.  

ఆ పుణ్యం వలన ఆ రాజుగారి భార్య గర్భవతియై,  క్రమముగా నవమాసాలు నిండిన తర్వాత ఒక  శుభముహూర్తమున చక్కని పుత్రునికి జన్మనిచ్చింది. రాజకుటుంబీకులు సంతోషించి తమ దేశమంతట పుత్రోత్సవములు చేయించి, బ్రాహ్మణులకు దానధర్మాలు చేసి, ఆ బాలుడికి  'శత్రుజిత్' అని పేరుపెట్టి అల్లారుముద్దుగా పెంచుతున్నారు . 

కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగినందువలన తన దేశమంతట ప్రతి సంవత్సరం కార్తీకమాస వ్రతాలు, దీపారాధనలు చేయుడని ఆ రాజు శాసించాడు.

 రాకుమారుడు శత్రుజిత్ దినదిన ప్రవర్థమానుడవుతూ,  సకల శాస్త్రములు చదివి, ధనుర్విద్య, కత్తిసాము మొదలైన యుద్ధ విద్యల లో నైపుణ్యాన్ని పొందాడు. కానీ యవ్వనం  దుష్టుల సహవాసము, తల్లిదండ్రుల గారాబము అతనిని పెడద్రోవలో నడిపించాయి.  కంటికి నచ్చిన స్త్రీలను బలాత్కరిస్తూ , ఎదిరించిన వారిని దండిస్తూ  తన వాంఛలు తీర్చుకుంటూ , క్షణికసుఖాల కోసం ప్రజలని పీడించసాగాడు. 

తల్లిదండ్రులు కూడా, తమకు లేక లేక కలిగిన కుమారుడవడం చేత, చూసీ చూడనట్టు వ్యవహరించసాగారు. దాంతో శతృజిత్ ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది.  విశృంఖలంగా ప్రవర్తిస్తూ,  తనకడ్డు చెప్పేవారిని నరికేస్తానని కత్తి తిప్పి బెదిరిస్తూ ప్రజలను భయకంపితులను చేయసాగాడు.

ఇదిలా ఉండగా, ఒకరోజు చక్కని చుక్క లాంటి ఒక బ్రాహ్మణ యువతి అతని కంట పడింది. ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య. ఆమె అందచందములను వర్ణించడం  మన్మథునకైననూ శక్యం కాదు. అటువంటి  స్త్రీ కంటపడగానే రాజకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ వలె నిశ్చేష్టుడై కామవికారముతో ఆమెను సమీపించి తన కోరికని తెలియజేశాడు.

ఆమె కూడా ఆ రాకుమారుని సౌందర్యానికి ముగ్ధురాలై కులము, శీలము, సిగ్గు విడిచి అతని చెయ్యి పట్టుకొని తన శయన మందిరానికి తీసుకొని పోయి భోగములను  అనుభవించింది. ఇలా ఒకరిపై ఒకరు ప్రేమని పెంచుకోవడం చేత, వాళ్ళు ప్రతిరోజూ అర్ధరాత్రివేళ ఒక అజ్ఞాత స్థలములో కలుసుకోసాగారు.

ఇలా కొంతకాలం నిరాటంకంగా జరిగిపోయింది. ఈ విషయాన్ని పసిగట్టిన ఆమె భర్త ఆమెను, ఆ రాజకుమారుణ్ణి ఒకేసారి చంపాలన్న నిశ్చయంతో ఒక ఖడ్గాన్ని సంపాదించి సమయం కోసం ఎదురు చూడసాగాడు.

ఒక నాటి కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులిద్దరూ శివాలయములో కలుసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఎవరికి వారు వారి మార్గాలలో శివాలయానికి బయల్దేరారు. ఇదే తగిన సమయమని ఆ బ్రాహ్మణుడు తాను సంపాదించిన ఖడ్గాన్ని తీసుకొని గర్భగుడిలో దాగి వేచి చూడసాగాడు.

ఆ కాముకులిద్దరునూ గుడిలో కలుసుకున్నారు. అప్పుడు రాకుమారుడు "చీకటిగా ఉన్నది, దీపముంటే బాగుండేది కదా," అన్నాడు. దాంతో ఆమె తన పైట చెంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించింది .
తర్వాత వారిరువురు మహానందముతో రాసలీలకి సిద్ధమవుతుండగా, అదే అదునుగా భావించిన ఆమె భర్త తన మొలనున్న కత్తితీసి ఒక్క వేటుతో తన భార్యను, ఆ రాజకుమారునీ ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాడు .

వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి, సోమవారము. ఆ రోజు ముగ్గురు చనిపోవడం వల్ల శివదూతలు ఆ ప్రేమికులిరువురినీ తీసుకుపోవడానికి, యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోయేందుకు అక్కడకు వచ్చారు.

యమదూతలని చూసి బ్రాహ్మణుడు "ఓ దూతలారా! కామాంధ కారముతో కన్ను మిన్ను తెలియక పశు ప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కోసం శివదూతలు విమానంలో రావడమేమిటి? నన్ను తీసుకొని వెళ్లేందుకు యమదూతలైన మీరు రావడమేమిటి? ఇది చాలా చిత్రముగా ఉన్నదే !” వివరించండని కోరాడు.

అప్పుడా యమకింకరులు "ఓ బాపడా! వారెంతటి నీచులైనా , యీ పవిత్ర దినమున, అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినమున తెలిసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన, అప్పటివరకూ వారు చేసిన పాపములన్ని నశించి పోయాయి .

కాబట్టి వారిని కైలాసమునకు తీసుకొనిపోయెందుకు శివదూతలు వచ్చారు " అని చెప్పారు. ఈ సంభాషణ మొత్తం విన్న రాజకుమారుడు "అలా ఎప్పటికీ జరగనివ్వను . తప్పొప్పులు ఎలా ఉన్న మేము ముగ్గురం ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించాము. కాబట్టి, ఆ ఫలితం మా ముగ్గురికీ వర్తించాల్సిందే “ అని తాము చేసిన దీపారాధన ఫలములో కొంత ఆ బ్రాహ్మణునికి దానం చేశాడు . వెంటనే శివదూతలు అతన్ని కూడా పుష్పక విమానమెక్కించి శివసాన్నిధ్యానికి చేర్చారు . 

విన్నావు కదా జనక మహారాజా! శివాలయంలో దీపారాధన చేయడం వలన ఆ ప్రేమికులు చేసిన పాపాలు పోవడమే కాక, కైలాస ప్రాప్తి కూడా కలిగింది. కాబట్టి కార్తీకమాసంలో నక్షత్రాలు కనిపించే సమయంలో దీపాన్ని ఉంచిన వారు జన్మరాహిత్యాన్ని పొందుతారు.” అని వసిష్ఠ మహర్షి వివరించాడు.

స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి నాలుగో యధ్యాయము,
నాల్గవ రోజు పారాయణము సమాప్తము.

సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు ! స్వస్తి

Post a Comment

0 Comments