Ad Code

Ticker

6/recent/ticker-posts

ఆకాశదీపం ప్రాముఖ్యత/Significance of Akasadeepam

 


కార్తీకమాసం ఆకాశదీపంతో ప్రారంభమవుతుంది. నిజానికి ఏవి ఆకాశదీపాలు?  ఆకాశదీపాలు  మీరు, నేను పెట్టక్కరలేదు. ఆకాశదీపాలు వెలిగించినవాడు పరమేశ్వరుడు. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవి ఆకాశదీపాలు. మరి కార్తీకమాసం ప్రారంభం దేనితో మొదలు? ఆకాశదీపంతో ప్రారంభిస్తారు. ఆకాశదీపం ఎక్కడ వెలిగిస్తారు? దేవాలయంలో వెలిగిస్తారు. దేవాలయంలో ధ్వజ స్తంభానికి తాడుకట్టి ఒక చిన్న పాత్రలో దీపం వెలిగించి, గాలికి నిధనం కాకుండా రంధ్రములతో ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా సమంత్రకంగా భగవంతుని నామాలు చెబుతూ , భక్తులందరూ చుట్టూ నిలబడి ఉండగా, ఆ దీపాన్ని పైకెత్తుతారు. ఎవరి శక్తి కొలదీ వాళ్లు తగినట్లుగా వారు కార్తీక మాసంలో భక్తులు ఆకాశదీపానికి చమురు, వత్తులు ఇస్తూ ఉంటారు.


ఆకాశదీపాన్ని పైకెత్తుతారు ఎందుకని?
ఆ దీపం ధ్వజస్తంభం మీద ఉండి అంతటా వెలుతురు చిమ్ముతుంది. ధ్వజస్తంభం మీదకి  పతాకాన్ని ఆరోహణ చేశారు అంటే ఈశ్వరునికి ఉత్సవం అవుతుందని గుర్తు. ఇంకా కార్తీకమాసంలో మనమే ఉత్సవం చేస్తున్నాం. ఉత్‌ అంటే తలపైకెత్తడం. తల పైకెత్తి చూశాడు కాబట్టి ఉత్సవం. దీపం తీసుకెళ్లి ఓ గదిలో పెట్టామనుకోండి కొంత ఫలితం. వీధిలోకి తీసుకువచ్చి దీపం పెట్టామనుకోండి విశేషఫలితం. ఆకాశ దీపాన్నిసందర్శించి ఈ క్రింది శ్లోకాన్ని మననం చేసుకోవాలి.

కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః
జలే స్థలే యే నివసంతి జీవాః!
దృష్ట్వా ప్రదీపం నచ జన్మ భాగినః
భవంతి త్వం శ్వపచాహి విప్రాః!!

ఈ శ్లోకం చెప్పి నమస్కారం చేయాలి. 

చీమలు, ఈగలు, దోమలు, పురుగులు, వృక్షాలు, జలచరాలు, భూచరాలు ఒకటేమిటి ఈ భూమి మీద నివసించే ప్రతీ ఒక్క జీవికి కూడా ఈ దీపం వెలుతురుని దర్శించ గానే ఇక మరుజన్మ అంటూ లేని అనంత పుణ్యాన్ని పొందాలి. వైదిక ధర్మాన్ని నమ్మక కేవలం తన సుఖం కోసమే కర్మలను ఆచరించేటటువంటి వాడుకూడా ఈ దీప కాంతి ప్రసరించడం చేత అభ్యున్నతి కలిగి మరుజన్మలో వేదం నేర్చి లోకోపకారియైన బ్రాహ్మణ జన్మను పొంది ఉద్ధరించపడాలి.

సంకల్ప శక్తి గురించి మన పురాణాలలో అనేక కథలున్నాయి. పరబ్రహం యొక్క సంకల్పం నుండే ఈ సృష్టి ప్రారంభమైనదని తెలుస్తుంది. ఋషి పరంపర మనకు నేర్పిన “లోకా స్సమస్తా స్సుఖినో భవంతు" అన్న సంకల్పం నేటికీ మన భారతీయులందరూ చెప్పుకుంటారు. మనం చేయలేని పనులు కూడా ఒక్కోసారి మన సంకల్ప శక్తి వలన పూర్తవడం గమనించవచ్చు. ఒక మంచి సంకల్పం వలన మనమే కాక మన చుట్టూ ఉన్న వారు కూడా లబ్దిని పొందుతారు. ఎవరికి ఏ శక్తి ఉందో ఎవరం చెప్పగలం. ప్రతీ ఒక్కరూ దీపాన్ని వెలిగించి పై శ్లోకాన్ని చెప్పి, దాని భావాన్ని మననం చేసుకుంటూ సంకల్పం చేస్తే ఇంతమంది ప్రార్థన ఊరికే పోతుందా!? ఆ ఈశ్వరుడు తప్పక స్వీకరిస్తాడు. లోకాలను తరింప చేస్తాడు.

వైదిక సంబంధమైన కర్మలు మనకోసం చేసుకున్నా అవి లోకకళ్యాణానికి కారణమౌతాయి. నేటికీ ఆర్తితో ప్రార్థించిన వారికి తగిన సహాయం అందుతున్నది అంటే, లోకంలో మంచి అన్నది కనిపిస్తున్నదీ అంటే, ఇటువంటి ప్రార్ధనల ఫలితమే కదా! కనుక అందరం కార్తీక మాసంలో ప్రతీ రోజూ దీపాన్ని దర్శించి ఈ ప్రార్ధన చేద్దాం!

Post a Comment

0 Comments